Wednesday, April 20, 2016

హనుమాన్ జయంతి

చైత్రశుద్ధ పౌర్ణమి నాడు జరుపుకునే హనుమాన్ జయంతి రోజున జిల్లేడు వత్తులు, నువ్వుల నూనెతో ఆంజనేయస్వామికి దీపం వెలిగిస్తే అష్టైశ్వర్యాలూ చేకూరుతాయి. హనుమాన్ జయంతి రోజు సాయంత్రం ఆరు గంటల ప్రాంతంలో హనుమాన్‌ను ఆలయంలో దర్శించుకుని, ఎర్రటి ప్రమిదల్లో జిల్లేడు వత్తులు, నువ్వులనూనెతో దీపమెలిగించే వారికి ఆయుర్దాయం, సుఖసంతోషాలు, అష్టైశ్వర్యాలు చేకూరుతాయని పురోహితులు అంటున్నారు. ఇంకా హనుమంతుని ఆలయాల్లో ఆకుపూజ చేయించడం, హనుమాన్ కళ్యాణం జరిపే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం. అలాగే గృహంలో పూజచేసే భక్తులు, పూజామందిరమును శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. ఎర్రటి అక్షతలు, ఎర్రటి పువ్వులను పూజకు సిద్ధం చేసుకోవాలి. పూజకు పంచముఖాంజనేయ ప్రతిమను లేదా ఫోటోను ఎర్రటి సింధూరం, ఎర్రటి పువ్వులతో అలంకరించుకోవాలి. నైవేద్యానికి బూరెలు, అప్పాలు, దానిమ్మ పండ్లు సమర్పించుకోవచ్చు.
పూజా సమయంలో హనుమాన్ చాలీసా ఆంజనేయ సహస్రము, హనుమచ్చరిత్ర వంటి స్తోత్రాలతో మారుతిని స్తుతించుకోవాలి. లేదా “ఓం ఆంజనేయాయ నమః” అనే మంత్రాన్ని 108 సార్లు జపించి, ఐదు జిల్లేడు వత్తులను నువ్వుల నూనెతో తడిపిన పంచహారతిని స్వామివారికి అర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత ఆంజనేయ ఆలయాలను సందర్శించుకోవడం మంచిది. ఇంకా అరగొండ, పొన్నూరు, కసాపురం, గండిక్షేత్రం వంటి పుణ్యక్షేత్రాలను దర్శించుకునే వారికి కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుందని విశ్వాసం. ఇదే రోజున హనుమాన్ ధ్యాన శ్లోకములు, హనుమాన్‌ చాలీసా పుస్తకములు దానం చేసేవారికి సుఖసంతోషాలు చేకూరుతాయని నమ్మకం.

Tuesday, April 19, 2016

శ్రీ వేంకటేశ్వర స్వామి, గోదా సమేత రంగనాథ స్వామి ఆలయం

శ్రీ వేంకటేశ్వర స్వామి, గోదా సమేత రంగనాథ స్వామి ఆలయం, యామ్నం పేట, ఘట్కేసర్ దగ్గర, హైదరాబాద్. హైదరాబాద్ లోని ఉప్పల్ సర్కిల్ నుండి సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఘట్కేసర్ కు ముందుగా వచ్చే రింగ్ రోడ్డు ను ఆనుకొని ఉన్న ఈ పురాతన ఆలయం షుమారు 400 వందల సంవత్సరాల క్రితం నాటిది. ఔరంగజేబు కాలంలో ధ్వంసం గావింపబడిన ఈ దేవాలయం దాతల సహకారంతో 2007 వ సంవత్సరంలో పునర్నిర్మాణం చేయబడినది. ఇక్కడ ప్రధానాలయంలో వేంకటేశ్వర స్వామి, మహాలక్ష్మి, గోదాదేవి మరియు రంగనాథ స్వామి వార్ల ధ్రువ మూర్తులతో బాటు, ఉత్సవ మూర్తులు కూడా ఉన్నాయి. దాదాపు ఏడడుగుల పైగా ఉన్న వేంకటేశ్వర స్వామి వారి ధ్రువ మూర్తి అద్భుతంగా ఉంటుంది. ప్రక్కనే శయనమూర్తి అయిన "రంగనాథ స్వామి" వారి ఆలయం ఉంది. ఇక్కడ ప్రతి ఏడాది "వైకుంఠ ఏకాదశి" మరియు "సంక్రాంతి ముందు రోజు "గోదా కల్యాణం" వైభంగా జరుగుతాయి. ప్రధాన ఆలయాలతో బాటు, క్షేత్ర పాలకుడైన "హనుమాన్" ఆలయం కూడా ఉంది. ఈ ఆలయం కూడా అతి పురాతన మయినది. అలాగే, వినాయకుడు, రాజ రాజేశ్వరి, నాగ దేవత ఆలయాలు కూడా నిర్మించారు. రెండెకరాల పైబడి స్థలంలో చుట్టూ పచ్చని పొలాలతో రమణీయ వాతావరణం లో కాస్త ఎత్తులో నిర్మించిన ఆలయంలో విశాలమైన ప్రాంగణం కూడా ఉంది.